మిడిల్ ఈస్ట్ యుద్ధం కారణంగా అటు అమెరికా.. ఇటు ఇరాన్ రెండు దేశాలు హర్ముజ్‌పై పట్టు విడవక పోవటంతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన రవాణాకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్న విషయం తెలిసిందే. కేవలం మిత్రదేశాల సరుకు రవాణా ఓడలు తప్ప మిగతా ఓడలను హర్ముజ్ దాటనివ్వకుండా అడ్డుకుంటున్న ఇరాన్.. ఇప్పుడు ఆ జలసంధిని 60 రోజుల పాటు పూర్తిగా ఓపెన్ చేయాలని నిర్ణయించుకున్నట్టు అంతర్జాతీయ మీడియా చెప్తోంది. ఇరాన్ పై యుద్ధాన్ని నిలిపివేస్తున్నామనీ.. ఆ దేశంలో శాంతి చర్చలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్తున్నాయనీ ట్రంప్ ఇదివరకే ప్రకటించాడు. ఇక.. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న అమెరికా మంత్రి మార్కో రూబియో కూడా దీనిపై చిన్న హింట్ ఇచ్చాడు. ఆదివారం భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచం త్వరలోనే ఓ పెద్ద శుభవార్త వినబోతోంది అంటూ వ్యాఖ్యానించాడు. అంతే కాకుండా.. భారత్ అమెరికా మధ్య మాత్రమే కాదు.. అమెరికా ఇరాన్ మధ్య కూడా చర్చలు పూర్తి అర్థవంతమయ్యాయి అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ట్రంప్.. మార్కో రుబియో మాటలను బట్టి.. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం పూర్తిగా కుదిరించని భావించవచ్చు.
ఇదిలా ఉంటే.. అమెరికా ప్రతిపాదించిన ప్రకారం.. ఇరాన్ తన వద్ద ఉన్న పూర్తి యురేనియంను అమెరికాకు అప్పగించేందుకు సిద్ధంగా ఉందంటూ ఇంటర్నేషనల్ మీడియాలో ఒక్కసారిగా వార్తలు వెలువడ్డాయి. 60 శాతం శుద్ధి చేసిన యురేనియంను కలిగి ఉన్న ఇరాన్.. కేవలం కొద్ది రోజుల్లోనే 90 శాతం వృద్ధి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇదే జరిగితే.. న్యూక్లియర్ వార్ హెడ్ తయారు చేయటానికి పెద్ద సమయం పట్టదు. కానీ ఇలాంటి సమయంలో.. తన వద్ద ఉన్న యురేనియం నిల్వలను వదులుకునేందుకు ఇరాన్ సిద్ధమైనట్టు మీడియాలో భారీగా కథనాలు ప్రసారం అయ్యాయి. ఇదే జరిగితే మళ్ళీ ఇరాన్ యురేనియంను శుద్ధి చేయటానికి కొన్ని దశాబ్ధాలు పట్టొచ్చు. ఇరాన్ తాను న్యూక్లియర్ పవర్‌ను వదులుకుంటే యుద్ధాన్ని పూర్తిగా ఆపేసి సాయం చేస్తామని ట్రంప్ గట్టిగా చెప్పాడు. ట్రంప్ షరతులకు ఇరాన్ ఒప్పుకుంటే గనుక.. కొద్ది గంటల్లోనే శాంతి ఒప్పందంపై కీలక ప్రకటన వెలువడే అవకాశముంది.
అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన శాంతి ఒప్పందంలో… ఇరాన్ యురేనియంను వదులుకోవటం.. న్యూక్లియర్ శక్తిగా మారేందుకు చేస్తున్న ప్రయత్నాలను నిలిపివేయటం.. హర్ముజ్‌లో పెట్టిన మందుపాతరలను ఇతర పేలుడు పదార్థాలను తొలగించి జలసంధిని పూర్తిగా తెరవటం.. అనేవి ప్రధాన షరతులు. ఇక ఇరాన్ కూడా అమెరికాపై కొన్ని షరతులు విధించింది. ఇరాన్ పై దాడులు పూర్తిగా ఆపేయాలనీ.. ప్రపంచానికి ఇరాన్ క్రూడాయిల్ రవాణా విషయంలో అమెరికా ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దనీ.. ఇరాన్ మిత్రదేశాలపై కూడా దాడులు పూర్తిగా ఆపేయాలనేవి ఆ షరతుల్లో ముఖ్యమైనవి. ఇరాన్ పూర్తిగా శాంతి ఒప్పందానికి ఒప్పుకుంటే.. ఖతర్ బ్యాంకుల్లో ఇరాన్ దాచుకున్న సుమారు 6 బిలియన్ డాలర్లను రిలీజ్ చేయటానికి కూడా ట్రంప్ అంగీకరించాడు. ఇవన్నీ ఇప్పటికే జరిగిపోయాయన్నది నిజమైతే.. మరి కొద్ది గంటల్లో మిడిల్ ఈస్ట్‌లో శాంతి మంత్రం వినిపించటం ఖాయం.
