అత్యవసరం అయితే తప్ప బంగారం కొనవద్దంటూ ప్రధానమంత్రి మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేసిన నాటి నుంచి బంగారం ధరలు డౌన్ ట్రెండ్‌లోనే కొనసాగుతోంది. ఈ వారం బులియన్ మార్కెట్ వరుస తగ్గుదల నమోదు చేసింది. వారం ప్రారంభంలో అంటే.. సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఒక లక్ష 64 వేలకు పైగా ఉండగా.. శనివారం సాయంత్రానికి లక్ష 63 వేలకు పడిపోయింది. మరీ ఎక్కువగా కాకపోయినా.. ఈ వారం వెయ్యి రూపాయలు ధర తగ్గింది. అంతర్జాతీయ పరిస్థితులను బట్టి చూస్తే భారతదేశంలో బంగారం ధర తగ్గటం అనేది వచ్చే వారం కూడా కొనసాగే అవకాశాలున్నాయనీ.. ఒక వేళ భారీ తగ్గుదల కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయనీ బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బంగారం కొనవద్దు అనుకున్న వాళ్ళు కూడా ధర తగ్గే సరికి చిన్న మొత్తాల్లో బంగారాన్ని కొనుగోలు చేస్తుండటం వల్ల ఈ మాత్రం తగ్గుదల మాత్రమే నమోదైందనీ.. ధర తగ్గిందని ఆశపడి కొనటం మానేస్తే ఇంకా ధరల తగ్గుదల ఇంకా ఎక్కువ నమోదయ్యే అవకాశాలున్నాయనీ చెప్తున్నారు.
మార్కెట్ నిపుణులు కూడా బంగారాన్ని పెట్టుబడిగా లేదా భవిష్యత్తు అవసరంగా చూడకుండా అత్యవసరం అయితేనే కొనాలంటూ సూచనలు చేస్తున్నారు. ఒక వేళ పెట్టుబడి రూపంలో బంగారాన్ని కొనాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఇతర రూపాల్లో తమ డబ్బును పెట్టుబడిగా పెట్టాలని సూచిస్తున్నారు. పెద్ద మొత్తంగా బంగారం కొనాలనుకున్న వాళ్ళు ఆ సొమ్మును స్థలాలు కొనటం లేదా రియలెస్టేట్లో పెట్టుబడులుగా పెట్టాలని చెప్తున్నారు. ఇక వెండి పరిస్థితి కూడా ఇదే రకంగా కొనసాగుతోంది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు చేస్తున్నాయి. బంగారు ఆభరణాలు అమ్మే పెద్ద సంస్థలు.. బంగారం ధర తగ్గిందనీ.. భవిష్యత్తులో మళ్ళీ పెరుగుతుంది కాబట్టి నగలు కొనటానికి ఇదే మంచి అవకాశం అంటూ ఆఫర్లు ఇవ్వటం కూడా బంగారం కొనుగోళ్ళకు కొంత వరకు కారణమైందనీ.. కానీ ఈ రకమైన కొనుగోళ్ళు ఇక మీదట కొనసాగటం కష్టమనీ చెప్తున్నారు. ఏది ఏమైనా.. ఇండియన్ మార్కెట్లో భవిష్యత్తులో బంగారం ధర తగ్గుదల తప్ప పెరుగుదల నమోదు చేసే అవకాశాలు తక్కువేనని నిపుణుల అభిప్రాయం.
