కాక్రోచ్ జనతా పార్టీ అంటూ దేశవ్యాప్తంగా రచ్చ రచ్చ చేస్తున్న అసంతృప్త యువత.. నిజమైన రాజకీయ పార్టీలను మించిపోతోంది. రోజురోజుకూ యువతలో ఈ ఫేక్ పార్టీకి ఫాలోవర్స్ విపరీతంగా పెరిగిపోవటమే కాకుండా.. తమను తాము కాక్రోచ్ జనతా పార్టీ నేతలమని చెప్పుకుంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. లేటెస్ట్ హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి.. కాక్రోచ్ జనతా పార్టీ తరఫున తానే తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిని అని చెప్పుకుంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేసేస్తున్నాడు. తానే సీఎం అయితే ఏం చేస్తాడో తన మేనిఫెస్టో కూడా చెప్పేస్తున్నడు ఈ వ్యక్తి. ఈ వ్యక్తి పేరు ఇర్ఫాన్.. సెక్రెటేరియట్ ముందు నిలబడి ఓ వీడియో తీసి వైరల్ చేసేశాడు. తన పేరు ఇర్ఫాన్ అనీ.. తానే తెలంగాణ సీఎం అయితే కేబీఆర్ పార్క్ చెట్ల నరికివేతను అడ్డుకుంటాననీ.. మెట్రోను విస్తరించటమే కాకుండా హైదరాహబాద్‌కు కొత్త బస్సులను వేస్తాననీ చెప్తున్నాడు. రేపే కేసులను ఫాస్ట్‌గా విచారించేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయటంతో పాటు నిరుద్యోగుల కోసం వెంటనే జాబ్ నోటిఫికేషన్లు జారీ చేస్తానంటున్నాడు. విద్యార్థుల ఫీజుల రీఅంబర్స్‌మెంట్‌తో పాటు విద్యార్థుల సమస్యలను తీర్చేస్తానంటూ హామీ ఇస్తున్నాడు. ప్రతి రూపాయి ప్రజాధనం ఆడిటింగ్ చేస్తాననీ.. ఎమర్జెన్సీ వైద్యం ఫ్రీ చేస్తాననీ.. సినిమా హీరో రేంజ్‌లో హామీల వర్షం కురిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తోంది.
ఓ కేసు విషయంలో స్పందిస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చేసిన చిన్న వ్యాఖ్య.. దేశవ్యాప్తంగా పెద్ద సంచలనానికి కారణమైంది. ఏ పనీ లేని కొంత మంది యువకులు అవసరం లేని పనికిరాని కేసులతో సుప్రీంకోర్టుకు వచ్చి తమ సమయాన్ని వృధా చేస్తున్నారనీ.. డబ్బున్న కొంత మంది పెద్ద మనుషుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి సమాజాన్ని బొద్దింకల్లా పీడిస్తున్నారంటూ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. దీనికి సమాధానంగా అభిజీత్ దీప్కే అనే ఓ యువకుడు నిరుద్యోగంతా బొద్దింకలుగా వర్ణిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో కాక్రోచ్ జనతా పార్టీ అంటూ ఓ పేరడీ పార్టీని ప్రారంభించగా.. అది కాస్తా నిరుద్యోగ యూత్‌కు బాగా కనెక్ట్ అయి ఈ రేంజ్‌లో సంచలనాలకు కారణమవుతోంది. బీజేపీ వంటి అతిపెద్ద రాజకీయ పార్టీనే మించిపోయేంత మంది ఫాలోవర్లను సాధించిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్‌ను బ్లాక్ చేస్తున్నట్టు ట్విటర్ ప్రకటించగా.. మిగతా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా నిషేధించాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.



