జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం పేరు వినగానే ప్రతి భారతీయుడి గుండె రగిపోతుంది. గత ఏడాది ఏప్రిల్ 22న బైసారన్ లోయలో ఉగ్రవాదులు చెలరేగిపోయి మతం పేరుతో 26 మంది హతమార్చడాన్ని ఎప్పటికీ మరచిపోలేం. ఈ ఘటన యావత్తు దేశంతో పాటు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. ఆనాటి దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ – ఎన్‌ఐఏ తాజాగా న్యాయస్థానంలో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇందులో మరిని సంచలన విషయాలు వెలుగు చూశాయి. పాకిస్థాన్ కేంద్రంగా నడిచిన భారీ కుట్రకు ఆధారాలు కూడా బయటకు వచ్చాయి. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్- టీఆర్‌ఎఫ్ హ్యాండ్లర్లు పాకిస్థాన్ నుంచే ఈ దాడిని నడిపినట్లు స్పష్టమైపోయింది. పహల్గాం ఉగ్రవాడి వెనుక ప్రధాన సూత్రదారి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ చెందిన ఉగ్రవాది సైఫుల్లా అలియాస్ సాజిద్ జట్ అలియాస్ లంగ్డా అని ఎన్ఐఏ గుర్తించింది. అతడు పాకిస్థాన్ లాహోర్‌లో ఉండి పహల్గామ్‌లోని ఉగ్రవాదులకు నేరుగా ఆదేశాలు ఇచ్చాడని తేల్చింది.
పహల్గాంలో జరిగిన దాడికి ముందుగా ఏప్రిల్ 15, 16 తేదీల్లో ఫైజల్ జాట్ ఎలియాస్ సులేమాన్ షా, హబీబ్ తాహిర్ ఎలియాస్ జిబ్రాన్, హమ్జా అఫ్గానీ అనే ముగ్గురు ఉగ్రవాదులను సాజిద్ జట్ బైసరన్ లోయకు పంపించాడు. అక్కడ వారు భద్రతా ఏర్పాట్లు, పర్యాటకుల కదలికలపై నిఘా పెట్టారు. దాడి జరిగిన రోజున సాజిద్ జట్ ఉగ్రవాదులతో నిరంతర సంప్రదింపులు కొనసాగించినట్లు ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌లో వెల్లడించింది. వారికి రియల్ టైమ్ కోఆర్డినేట్లు, ప్రదేశాల సమాచారం, తప్పించుకునే మార్గాలపై సూచనలు ఇచ్చినట్లు తెలిపింది. దాడికి ఒక రోజు ముందు.. ముగ్గురు ఉగ్రవాదులు పహల్గామ్ ప్రాంతంలో సంచరించారు. ఆ క్రమంలోనే స్థానిక నివాసితులైన పర్వేజ్, బషీర్‌ను సంప్రదించి ఆశ్రయం కల్పించమని కోరారు. ఉగ్రవాదులు అమర్‌నాథ్ యాత్ర, పహల్గామ్‌లోని భద్రతా దళాల శిబిరాలు, బలగాల కదలికలు, ఆ ప్రాంతంలోని భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించారు.
ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యాటకులపై దాడి జరిగిన వెంటనే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ సంస్థ కశ్మీర్ ఫైట్ అనే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా స్పందించింది. ఈ ఘటనకు తమదే బాధ్యత అని గర్వంగా చాటుకుంది. అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు రావడం, ఐక్యరాజ్యసమితి ఖండించడంతో టీఆర్‌ఎఫ్ వెనక్కి తగ్గి తమ ఛానల్ హ్యాక్ అయిందని చెప్పుకుంది. అయితే ఎన్‌ఐఏ జరిపిన సాంకేతిక దర్యాప్తులో ‘కశ్మీర్ ఫైట్’ ఛానల్ పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూంఖ్వా ప్రావిన్స్ బట్టాగ్రామ్ నుంచి నడిచినట్లు బయటపడింది. ‘ది రెసిస్టెంట్ ఫ్రంట్- అఫీషియల్’ అనే మరో ఛానల్రావల్పిండి నుంచి నిర్వహించారు. పహల్గాం ఘటన తర్వాత భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ మహదేవ్‌లో హతమైన ఉగ్రవాదుల వద్ద లభించిన రెండు మొబైల్ ఫోన్లలో కీలక సమాచారం దొరిగింది. ఆ ఫోన్లు పాకిస్థాన్‌లో కొనుగోలు చేసినవేనని ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. ఇందులో ఒక ఫోన్ లాహోర్, మరో ఫోన్ కరాచీ కొనుగోలు చేసినట్లు గుర్తించారు.
ఉగ్రవాదులకు సహకరిస్తున్నారనే విషయం పర్వేజ్, బషీర్‌లకు పూర్తిగా తెలుసని ఎన్ఐఏ పేర్కొంది. బషీర్ అహ్మద్ ఎన్ఐఏకు ఇచ్చిన వాంగ్మూలంలో దాడికి ఒకరోజు ముందు ముగ్గురు ఉగ్రవాదులను చూశానని పేర్కొన్నాడు. తమను సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లమని ఉగ్రవాదులు కోరగా పర్వేజ్ గుడిసె దగ్గరకు తీసుకెళ్లాడు. పంజాబీ, ఉర్దూ యాసలో మాట్లాడిన వారి ఉగ్రవాదుల దగ్గర ఆయుధాల సంచులు ఉన్నాయి. ఉగ్రవాదులు అల్లా పేరుతో సాయం కోరగా పర్వేజ్, బషీర్ వారికి నీరు, టీ, ఆహారం ఇచ్చారు. ప్రతిఫలంగా ఉగ్రవాదులు పర్వేజ్‌కు 3,000 రూపాయలు ఇచ్చారు. ముగ్గురు ఉగ్రవాదులు సుమారు ఐదు గంటల పాటు ఆ గుడిసెలోనే ఉన్నారు. ఆ దాడి తర్వాత పర్వేజ్, బషీర్ నిశ్శబ్దంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ఎన్ఐఏ తన చార్జిషీట్‌లో వెల్లడించింది. పర్వేజ్, బషీర్ సకాలంలో స్పందించి ఉంటే 26 మంది ప్రాణాలను కాపాడిన వారిగా ఉండేవారు. ఇదిలా ఉంటే.. పహల్గాం దాడికి వ్యూహరచన చేసిన కమాండర్లను ఒక్కొక్కరినీ పాకిస్తాన్‌లోనే హతమారుస్తున్నారు గుర్తు తెలియని వ్యక్తులు. కొద్ది గంటల క్రితమే ఈ కమాండర్లలో ఒకడైన హంజా బుర్హానీని హతమార్చగా.. ఇక హిట్ లిస్టులో ఉన్న వారు గజగజ వణుకుతున్నారు
