పాకిస్తాన్లో గుర్తుతెలియని వ్యక్తుల వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. భారత గడ్డపై టెర్రరిస్టు దాడులకు ప్లాన్లు వేసి అమలు చేసిన పెద్ద తలకాయలను ఒక్కొక్కటిగా ఏరి వేస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు ఇప్పుడు మరో హెడ్‌ను లేపేశాయి. పుల్వామా ఉగ్రదాడి కీలక సూత్రధారి హమ్జా బుర్హాన్ హతమయ్యాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో గుర్తుతెలియని వ్యక్తులు అతడిని కాల్చిచంపారు. ఒంటరిగా ఉన్న హమ్జా బుర్హాన్‌ను సింగిల్ బుల్లెట్‌తో లేపేసి అక్కడి నుంచి పరారయ్యారు సదరు గుర్తు తెలియని వ్యక్తులు. హమ్జా హత్యతో పాకిస్తాన్లో మరోసారి అల్లకల్లోలం మొదలైంది. టెర్రరిస్టులకు స్వర్గధామంలాంటి పాకిస్తాన్లో.. అదీ పాకిస్తాన్ ఐఎస్ఐ అండతో టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న పెద్ద తలకాయలను అవకాశం దొరికినప్పుడల్లా హతమారుస్తున్నారు ఈ గుర్తు తెలియని వ్యక్తులు. ఇప్పటికే చాలా మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు ఇదే రకమైన దాడులలో హతమయ్యారు. ఇప్పుడు హతమైన హమ్జా బుర్హాన్.. పెద్ద చదువులు చదువుకోటానికి అని చెప్పి 2017లో పాకిస్తాన్ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్-బదర్‌లో చేరి, కొద్ది కాలంలోనే కమాండర్ స్థాయికి ఎదిగాడు. 2022లో భారత్ అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది.
2019 ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి ఘటన వెనక పాకిస్థాన్ హస్తం గల ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ఉన్నట్లు భారత నిఘాసంస్థలు గుర్తించాయి. దీనికి ప్రతీకారంగా భారత వాయుసేన ఫిబ్రవరి 26న వైమానిక దాడులు చేపట్టింది. పాక్ భూభాగంలోని బాలాకోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలపై తెల్లవారుజామున బాంబుల వర్షం కురిపించింది. ఆ తర్వాత పాక్ ప్రతీకార దాడులు చేపట్టింది. పాకిస్తాన్ ప్రతీకార దాడులను తిప్పికొట్టడానికి.. పాకిస్తాన్ యుద్ధ విమానాలను కూల్చివేయటానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగగా.. భారత ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్.. అనుకోకుండా ఫైటర్ జెట్ కూలిపోయి పాకిస్తాన్ గగనతలంలో పడిపోయాడు. ఆ తర్వాత అత్యంత నాటకీయంగా ఆయనను పాకిస్తాన్ భారత్‌కు తిరిగి అప్పగించింది. అయితే.. ఈ దాడిలో సూత్రధారులైన జైష్ ఇ మహమ్మద్‌కు చెందిన చాలా మంది కమాండర్లను వీలు చిక్కినప్పుడల్లా గుర్తు తెలియని వ్యక్తులు హతమారుస్తూనే ఉన్నారు. పుల్వామా దాడి.. పహల్గామ్ దాడి.. అప్పుడెప్పుడో జరిగిన ముంబై అటాక్స్.. ఇలా భారత్‌పై జరిగిన ప్రతి టెర్రర్ దాడితో సంబంధం ఉన్న వ్యక్తులను వరుసగా ఈ గుర్తు తెలియని వ్యక్తులు హతమారుస్తూనే ఉన్నారు. ఆప్ఘనిస్తాన్‌లోని భారత అనుకూల ఆర్మీ కమాండర్లకు టార్గెట్ ఇచ్చి.. స్వయంగా భారత్ ఈ దాడులు చేయిస్తోందని పాకిస్తాన్ గగ్గోలు పెడుతోంది. పాకిస్తాన్ ఎంత మొత్తుకున్నా ఈ దాడులు మాత్రం ఆగటం లేదు.
