ఎన్నికల్లో పోటీ చేసిన మొదటి సారే ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకొని తమిళనాడు రాజకీయ చరిత్రలో చెరిగిపోని అధ్యాయాన్ని తనపేరిట రాసుకున్న దలపతి విజయ్.. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఎవరూ ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అయితే.. అందులో కొన్ని అందరూ మెచ్చేవి అయితే.. మరి కొన్ని కాస్త విచిత్రంగా అనిపించే నిర్ణయాలు. తాజాగా ఎఐడీఎంకే పార్టీలోని తిరుగుబాటు నేతలందరినీ పిలిచి వారికి మంత్రి పదవులు కట్టబెట్టేందుకు విజయ్ సిద్ధమయ్యారన్న వార్త తమిళనాడు రాజకీయాలను కొద్ది గంటల పాటు షేక్ చేసింది. కానీ అంతలోనే విజయ్‌కు ఏఐడీఎంకే వార్నింగ్ ఇవ్వటం.. అలాంటిదేమీ లేదని విజయం క్లారిటీ ఇవ్వటంతో పరిస్థితి చల్లబడింది. ఇప్పుడు సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయాన్ని తీసుకొని మళ్ళీ అందరినీ ఆశ్చర్యపరిచాడు.
సుమారు 59 సంవత్సరాలుగా తమిళనాడు మంత్రివర్గంలో స్థానం సంపాదించుకోలేని కాంగ్రెస్ పార్టీకి.. విజయ్ ఏకంగా రెండు మంత్రి పదవులను కట్టబెట్టి ఆశ్చర్యపరిచారు. కాంగ్రెస్ మద్దతుతోనే విజయ్ తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తన పార్టీ టీవీకేకు మద్దతిచ్చినందుకు కృతజ్ఞతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలైన రాజేశ్ కుమార్, పి. విశ్వనాథన్‌లకు తమిళనాడు నూతన మంత్రివర్గంలో చోటు కల్పించాడు విజయ్. ఇందుకు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ మద్దతు ఇచ్చినట్టు విజయ్ పార్టీ పేర్కొంది. ఇన్నేళ్ళుగా తమిళనాడులో సొంతంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయినా.. విజయ్ వల్ల ఇప్పుడు కనీసం తమిళనాడు మంత్రివర్గంలో చోటు సంపాదించటం విశేషం.
