మిడిల్ ఈస్ట్‌లో గత కొద్ది రోజులుగా జరుగతున్న యుద్ధానికి తాత్కాలిక విరామం వచ్చింది. ఇరాన్‌పై మళ్ళీ దాడి చేయాలన్న సరికొత్త ప్లాన్‌ను ప్రస్తుతానికి పక్కన పెట్టామనీ.. గల్ఫ్ దేశాలన్నీ కలిసి చేసిన విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకొని ఇరాన్‌పై దాడిని పోస్ట్ పోన్ చేశామనీ ట్రంప్ అధికారికంగా ప్రకటించాడు. అయితే.. తమతో శాంతి ఒప్పందానికి ఇరాన్ అంగీకరించని పక్షంలో మళ్ళీ దాడికి ఏమాత్రం వెనుకాడబోమని కూడా ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. ఖతర్, సౌదీ, యూఏఈ వంటి దేశాల నుంచి ఖచ్చితమైన అభ్యర్థన రావటం వల్లనే ఇరాన్‌పై దాడిని ఆపామని చెప్పిన ట్రంప్.. తమ షరతులకు ఇరాన్ ఖచ్చితంగా అంగీకరించాల్సిందేననీ.. అలాగే అణ్వాయుధ తయారీ ఆలోచన పూర్తిగా మానుకోవాలని పునరుద్ఘాటించాడు. ఇప్పటికే ఇరాన్ కోసం తాము 14 సూత్రాల శాంతి ప్రణాళికను రూపొందించినా ఆ దేశం ఒప్పందానికి అంగీకరించటం లేదనీ.. ఇది ఇలాగే ఎంతో కాలం కొనసాగనివ్వబోమనీ చెప్పిన ట్రంప్.. పాకిస్తాన్ మధ్యవర్తిత్వానికి కట్టుబడి శాంతి ఒప్పందానికి ఇరాన్ ముందుకు రావాలని పిలుపునిచ్చాడు. ఇక ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తున్న హర్ముజ్ జలసంధి దిగ్బంధంపై కూడా ఒక నిర్ణయానికి రావాలని ఇరాన్‌కు చెప్పాడు.
ప్రస్తుతానికి ఇరాన్ అదుపులో ఉన్న హర్ముజ్ జలసంధి ద్వారా ఇరాన్ తమ మిత్రదేశాలకు చెందిన ఓడలను మాత్రమే అనుమతిస్తూ.. ఇతర దేశాలకు చెందిన ఓడల నుంచి చార్జీలు వసూలు చేస్తోంది. ట్రంప్ దీన్ని వ్యతిరేకిస్తూ హర్మూజ్ స్ట్రెయిట్ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పాడు.
ట్రంప్ ప్రకటనపై ఇరాన్ అధికారికంగా స్పందించింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మీడియాతో మాట్లాడుతూ అమెరికాతో శాంతి ఒప్పందానికి తాము సిద్ధమేననీ.. కానీ ట్రంప్ పెట్టిన అన్ని షరతులకు తాము అంగీకరించేది లేదని కూడా స్పష్టం చేశాడు పెజెష్కియాన్. అయితే.. శాంతి ఒప్పందానికి అంగీకరించటం అంటే ఓటమిని అంగీకరించినట్టు కాదనీ.. తాము ఎంతటి భీకర యుద్ధానికైనా సిద్ధమేననీ మరోసారి చెప్పాడు. ఇరాన్ దేశ ప్రజల ప్రాణాలతో పాటు వారి హక్కులను పరిరక్షించటం కోసం ఏదైనా చేస్తామని చెప్పాడు. అది ఏమైనా.. ట్రంప్ ప్రకటన తర్వాత ప్రస్తుతానికి మిడిల్ ఈస్ట్ మంటలు కొంత మేర తగ్గాయనేది మాత్రం నిజం. మరోవైపు లెబనాన్ పాలస్తీనాలోని హెజ్బుల్లా స్థావరాలపై మాత్రం అమెరికా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో చమురు సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుతున్న క్రమంలో.. మధ్యప్రాచ్యంలో యుద్ధం ముగింపు దిశగా వెళ్తుండటం మంచి పరిణామమనే చెప్పాలి.
