సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. చేతిలో అధికారం ఉన్నదని మోడీ అహంకారంతో ప్రవర్తిస్తున్నారని.. ఇది ప్రధానమంత్రి స్థాయి వ్యక్తికి పనికిరాదనీ అన్నారు కేసీఆర్. ఒకప్పుడు ఇదే అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ కోసం నిధులు ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తే.. ఒక్క రూపాయి ఇయ్య ఏం చేస్కుంటవో చేస్కో అని సమాధానం చెప్పాడు.. ఇప్పుడు ఏమైంది.. అహంకారంతోని ప్రవర్తిస్తే ఇదే జరుగుతుంది.. అధికారం శాశ్వతం కాదు.. అంటూ మోడీకి కేసీఆర్ హితవు చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలో యేడేళ్ళుగా అడిగీ అడిగీ అలిసిపోయామన్న కేసీఆర్.. మోడీ ప్రభుత్వాన్ని అడగటమే మానేయాల్సి వచ్చిందన్నారు.
“స్వాతంత్రం వచ్చి 75 యేళ్ళు గడిచినా ఇంకా మనం చిన్న చిన్న దేశాలతో కూడా పోటీ పడలేకపోతున్నామంటే అది ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వాలు పాలించిన విధానమే.. ఇప్పటి ప్రధానమంత్రి మోడీ భారత చరిత్రలో అత్యంత విఫలమైన ప్రధానమంత్రి. కనీసం జనాభా లెక్కలు చేపట్టే ఆలోచన లేదు కేంద్రానికి. ఉన్న సంస్థలన్నీ ప్రైవేటు, కార్పోరేట్ కంపెనీలకు అమ్మేయటం మాత్రమే మోడీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి. పుష్కలమైన నీళ్ళు, భూమి, వనరులు ఇన్ని ఉన్నా ఈ దేశాన్ని పరిపాలించే నాయకులకు సరైన దృక్పథం లేకపోవటమే మన దేశ పరిస్థితికి కారణం. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మోడీకి బీజేపీకి పరాభవం తప్పదు. కేంద్రంలో వచ్చేది రైతు ప్రభుత్వమే. చేసిన పనులకు మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది..” అంటూ మోడీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు కేసీఆర్.