రానున్న వారం రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్య అరేబియా సముద్రం మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాలు, పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్ బీహార్‌లోని మరికొన్ని ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్ మరియు ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరించడానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌ను ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో తూర్పు మధ్య అరేబియా సముద్రం నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు దక్షిణ కొంకణ్, మధ్య మహారాష్ట్ర, ఉత్తర అంతర్గత కర్ణాటక, తెలంగాణ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం గుండా ఒక ద్రోణి విస్తరించి ఉంది. మధ్య బంగాళాఖాతం నుండి కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు అంతర్గత కర్ణాటక మీదుగా కోస్తా కర్ణాటక వరకు ఉన్న ద్రోణి ఈరోజు బలహీనపడింది.
రేపటి నుంచి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు మొదలయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో గంటకు 40 నుండి 50 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాల రాక కాస్త ఆలస్యమైనప్పటికీ.. ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి. అయితే.. ఈ వర్షాలను నమ్ముకొని రైతులు అప్పుడే పంటలు వేయవద్దని.. ఇవి కేవలం ప్రీ మాన్సూన్ వర్షాలు మాత్రమేననీ వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. మరో వారం రోజుల తర్వాత అసలైన వర్షాలు మొదలై.. పంటలకు అనుగుణంగా సుదీర్ఘ కాలంపాటు వర్షాలు పడతాయని.. అప్పుడు మాత్రమే వ్యవసాయ పనులు మొదలుపెట్టాలని చెప్తున్నారు.

