సరిహద్దులు దాటి బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్‌కు అక్రమంగా వలస వచ్చిన వారి ఏరివేత కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నకిలీ ధృవపత్రాలు.. ఆధార్ కార్డు, రేషన్ కార్డులతో బెంగాల్‌లో నివసిస్తున్న వారిని గుర్తించి వెంటనే బంగ్లాదేశ్‌కు డీపోర్ట్ చేయాలని ముఖ్యమంత్రి సువేందు అధికారి ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు, సైన్యం అక్రమ వలసదారులను ఏరేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం సువేందు మరోసారి బంగ్లాదేశీలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. చొరబాటుదారులు తమంతట తామే స్వచ్ఛందంగా బెంగాల్ వదిలి బంగ్లాదేశ్ వెళ్ళిపోవాలనీ.. సైన్యం చేత చిక్కితే మాత్రం తీవ్రమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి సువేందు హెచ్చరికతో చాలా మంది చొరబాటుదారులు తిరిగి బంగ్లాదేశ్ వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు. బెంగాల్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో వందల సంఖ్యలో చొరబాటుదారులు కనిపించిన తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. అక్రమంగా బెంగాల్‌లో చొరబాడిన వారిని తిరిగి బంగ్లాదేశ్‌లోకి వచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యతరం లేదనీ.. కాకపోతే చొరబాటుదారులను జైళ్ళలో పెట్టొద్దని బంగ్లాదేశ్ ప్రభుత్వం బెంగాల్ ప్రభుత్వాన్ని కోరింది.
బంగ్లాదేశ్ ప్రకటనకు స్పందించిన బెంగాల్ సీఎం సువేందు.. చొరబాటుదారులకు తిండి పెట్టి ఆశ్రయం ఇవ్వటం తమ పని కాదనీ.. చొరబాటుదారులు తీవ్రమైన పరిణామాలకు సిద్ధంగా ఉండాలనీ మరోసారి హెచ్చరించారు. సరైన గుర్తింపు కార్డులు లేని వారిని గుర్తించి.. ప్రస్తుతానికి వారిని మాల్దాలోని డిటెన్షన్ సెంటర్‌కు పంపిస్తున్నారు. డిటెన్షన్‌లో ఉన్న వాళ్ళలో ఎవరైనా నిజమైన బెంగాల్ పౌరులు ఉంటే వారిని తిరిగి రాష్ట్రంలోకి రానిచ్చి.. అక్రమ వలసదారులను మాత్రం సరిహద్దు గుండా బంగ్లాదేశ్‌లోకి పంపించేస్తున్నారు. మరోవైపు.. బెంగాల్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ శరవేగంగా కంచె నిర్మాణం చేస్తోంది. దీన్ని అడ్డుకునేందుకు బంగ్లాదేశ్ ఆర్మీ జవాన్లతో పాటు స్థానికులు బీఎస్ఎఫ్ జవాన్లపై రాళ్ళ దాడులకు పాల్పడుతుండగా.. మన సైనికులు వారికి గట్టి బుద్ధి చెప్పి వెనక్కి పంపిస్తున్నారు.



