అందరూ ఊహించినట్టే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రపంచానికి షాకిచ్చాడు. ఇరాన్ పై యుద్ధాన్ని ఆపేస్తున్నామనీ.. శాంతి ఒప్పందం దాదాపు ఖరారైందనీ చెప్పిన ట్రంప్.. రాత్రికి రాత్రి ఇరాన్ లోని కీలక ప్రాంతాలపై దాడులు చేయించి మళ్ళీ పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చాడు. తాము పెట్టిన అన్ని షరతులకు ఇరాన్ అంగీకరించిందనీ.. కొద్ది గంటల్లోనే ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పబోతున్నామనీ అమెరికా మంత్రి మార్కో రూబియో కూడా భారత్ వేదికగా ప్రకటించాడు. కానీ.. నిజానికి ఇరాన్ లో పరిస్థితి వేరేగా ఉంది. శాంతి ఒప్పందం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు బయటి ప్రపంచానికి కలరింగ్ ఇచ్చిన ట్రంప్.. తన అధికారులతో మాత్రం భీకర దాడులకు ఆదేశాలిచ్చాడు. ఇరాన్ లోని మిసైల్ కేంద్రాలపై దాడి చేసి వాటిని పూర్తిగా నాశనం చేయటం ద్వారా ఇరాన్ ఆయుధ సంపత్తిని నాశనం చేయాలని కుట్ర చేశాడు ట్రంప్. శాంతి ఒప్పందం నూరు శాతం పూర్తి అయ్యే లోపు.. పనిలో పనిగా ఇరాన్ మిసైల్ స్థావరాలను ధ్వంసం చేస్తే.. భవిష్యత్తులో ఇరాన్ మళ్ళీ యుద్ధానికి సిద్ధంగా ఉండదనేది ట్రంప్ ఆలోచన. ట్రంప్ ఆదేశాల మేరకు.. బందర్ అబ్బాస్ సహా పలు ప్రాంతాల్లోని సైనిక స్థావరాలను అమెరికా వైమానిక దళం ధ్వంసం చేసింది. ఆత్మరక్షణ కోసమే తాము ఇరాన్ క్షిపణి ప్రయోగ లాంచ్‌ప్యాడ్లు, సముద్రంలో మందుపాతరలు పరిచే బోట్లను ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించింది. ఈ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రతినిధి టిమోతీ హాకిన్స్ పేర్కొన్నారు.
సముద్రంలో మందుపాతరలు పరిచేందుకు యత్నిస్తున్న బోట్లను ధ్వంసం చేసినట్లు కూడా తిమోతీ వెల్లడించారు. తమ దేశానికి చెందిన రెండు విమాన వాహక నౌకలు, రెండు డజన్లకు పైగా యుద్ధ నౌకలకు తీరం వెంట ఉన్న ఇరాన్ క్షిపణి స్థావరాలు ముప్పుగా పరిణమించినట్లు వెల్లడించారు. తమ దాడిలో బందర్ అబ్బాస్ పోర్టులోని నేవీ బేస్ కూడా ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ కూడా పాల్గొన్నట్లు సమాచారం. ఇరాన్ వైపు లర్క్ ద్వీపంలో కనీసం నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. నేడు ఖతార్‌లో చర్చలు.. యుద్ధం ముగింపుపై నేడు ఖతార్ రాజధాని దోహాలో ఇరాన్-అమెరికా దూతలు చర్చలు జరపనున్నారు. కొన్నాళ్లక్రితం ఇరాన్ తమ క్షిపణి ప్రయోగకేంద్రాలు, అండర్‌గ్రౌండ్ ఫెసిలిటీలను పునరుద్ధరించిందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు తమ నాయకులకు వెల్లడించాయి. మొత్తం 33 మిసైల్ సైట్లలో 30 వరకు తిరిగి పనిచేయడం మొదలుపెట్టినట్లు గుర్తించాయి. దీంతోపాటు దేశవ్యాప్తంగా 70శాతం మొబైల్ మిసైల్ లాంచర్లను మోహరించినట్లు గుర్తించాయి. అమెరికాతో పరోక్ష చర్చల్లో భాగంగా పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలిబఫ్ నేతృత్వంలోని ఇరాన్ బృందం సోమవారం ఖతార్‌కు వెళ్లి అక్కడ కీలక సంప్రదింపులు జరిపింది. ఇరాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ అమెరికాతో అత్యధిక అంశాలపై అవగాహన కుదిరిందని స్వయంగా మీడియాకు చెప్పాడు. యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించటమే లక్ష్యంగా అందరం పనిచేస్తున్నామని చెప్పిన బఘాయీ.. అణ్వస్త్రాల అంశంపై మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు
