తెలంగాణ కాంగ్రెస్ లో 3 రోజుల నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రేవంత్ రెడ్డి ఈ రెండు పేర్ల చుట్టూనే రాజకీయం నడుస్తున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణ పీసీసీలో ఉన్న విభేధాలను పరిష్కరించి సీనియర్లనూ రేవంత్ రెడ్డి వర్గాన్నీ ఒక్కటి చేయాలన్న ఉద్దేశంతో విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఏఐసీసీకి ప్రతిసారీ ఎదురుదెబ్బే తగులుతోంది. ఈ సారి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకొని వచ్చిన మాణిక్ రావ్ థాక్రేకు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. కోమటిరెడ్డిని గాంధీ భవన్ కు రావాలంటూ కోరిన థాక్రేకు వెంకట్ రెడ్డి ఘాటు సమాధానం చెప్పారు. తాను గాంధీ భవన్ లో అడుగు పెట్టనని ఇదివరకే చెప్పాననీ.. కావాలంటే బయట కలుస్తాననీ స్పష్టంగా చెప్పాడట వెంకట్ రెడ్డి. చెప్పినట్టే థాక్రేతో వెంకట్ రెడ్డి సుధీర్ఘంగా సమావేశమై టీకాంగ్రెస్ పరిస్థితిపై చర్చించారు. అయితే ఈ చర్చలో వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలతో పాటు రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు కూడా చేసినట్టు తెలుస్తోంది.
కమిటీల గురించి తనకు అభ్యంతరం లేదనీ.. రేవంత్ రెడ్డి నాయకత్వంతోనే తనకు అసలు సమస్య అనీ థాక్రేకు వెంకట్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చారట. రేవంత్ తన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడనీ.. ఏకపక్ష నిర్ణయాలతో సీనియర్లకు సరైన గౌరవం ఇవ్వటం లేదనీ ఫిర్యాదు చేశాడట వెంకట్ రెడ్డి. మిగితా కాంగ్రెస్ నేతల అభిప్రాయాలతో తనకు సంబంధం లేదనీ.. తనకు ఎవరితోనూ సమస్య లేదనీ.. కేవలం రేవంత్ రెడ్డి నిర్ణయాల వల్లే తాను దూరంగా ఉండాల్సి వస్తుందనీ చెప్పారట. థాక్రే మరియు వెంకట్ రెడ్డి భేటీ తర్వాత టీ కాంగ్రెస్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి.