తెలుగు సినీ పరిశ్రమలో నంది అవార్డులపై నిర్మాత అశ్వనీదత్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటుగా స్పందించారు. ఎవరు పడితే వాళ్ళు అడిగితే నంది అవార్డులు ఇవ్వరని.. అసలు తమకు సినిమా అవార్డులు ఇచ్చే విషయంలో ఆసక్తే లేదని స్పష్టం చేశారు. “తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఇప్పటి వరకూ ఎవరూ నంది అవార్డుల విషయంలో మమ్మల్ని సంప్రదించలేదు.. కనీసం ప్రతిపాదనలు కూడా పంపలేదు.. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నంది అవార్డుల విషయంలో రెండు రాష్ట్రాలకూ ఏవిధమైన ఆసక్తి లేదు. అయినా.. నంది అవార్డుల విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. సినీ పరిశ్రమ నుంచి ప్రతిపాదనలు అందితే వచ్చే సంవత్సరం నంది అవార్డులు ఇస్తాం..” అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో నిర్మాత అశ్వీనదత్ మాట్లాడుతూ నంది అవార్డులు ఇప్పుడు టాలీవుడ్ లో తెలుగు రాష్ట్రాలకు ఇవ్వటం లేదని.. ఇప్పుడు అన్నీ ఉత్తమ రౌడీ, ఉత్తమ గూండా అవార్డులే ఇస్తున్నారనీ వివాదాస్ఫద వ్యాఖ్యలు చేశారు. దీనిపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీరియస్ గా స్పందించారు. ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాలు ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత నంది అవార్డుల విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు స్పష్టత లేదు. అవార్డులను ఏ రాష్ట్రం అధికారికంగా ఇవ్వాలి అనే దానిపై రెండు రాష్ట్రాల మధ్య ఏనాడూ చర్చ రాలేదు. కాబట్టి రెండు రాష్ట్రాలు పట్టించుకోలేదు. ఒక వేళ ఏ రాష్ట్రం అధికారికంగా నంది అవార్డులు ఇచ్చినా రెండో రాష్ట్రం నుంచి అభ్యంతరం వ్యక్తం కావచ్చు అనే కారణంగా అనవసర వివాదాన్ని సృష్టించటం ఇష్టం లేక రెండు రాష్ట్రాలు ఈ విషయాన్ని వదిలేశాయనే చెప్పాలి. ఇప్పుడు తలసాని ప్రకటన తర్వాత ఏపీ నుంచి ఎలాంటి అభ్యంతరం రాకుంటే తెలంగాణ ప్రభుత్వం అవార్డుల విషయంలో చొరవ తీసుకోవచ్చు.
