రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. సుమారు 30 సెకన్ల పాటు భూమి కంపించటంతో జనం ఇళ్ళను వదిలి వీధుల్లోకి పరుగులు తీశారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని చాలా సేపు వీధుల్లోనే జనం నిల్చుండిపోవటం కనిపించింది. నేపాల్ లో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించిందనీ.. దాని ప్రభావంగానే ఢిల్లీలో స్వల్ప భూకంపం సంభవించిందనీ అధికారులు చెప్తున్నారు. 20 రోజుల క్రితం జనవరి 5వ తేదీన అప్ఘనిస్తాన్ లోని హిందూకుష్ ప్రాంతంలో కూడా ఇదే తరహా భూకంపం సంభవించగా.. దాని ప్రభావం వల్ల కూడా ఢిల్లీలో ప్రకంపనలు కనిపించాయి.
సోమవారం నాడు ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది. ఇండోనేషియాలోని టొబెలోకు 162 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 12 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే అధికారులు చెప్తున్నారు.