ట్రైలర్ వచ్చీ రాగానే తీవ్ర విమర్శల పాలైన ప్రభాస్-ఓమ్ రౌత్ సినిమా ఆదిపురుష్ సినిమాకు మళ్ళీ కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ సెన్సార్ బోర్డు అనుమతి లేకుండానే సినిమా ట్రైలర్ ను విడుదల చేశారంటూ తివారి అనే వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఉత్తర్ ప్రదేశ్ సెన్సార్ బోర్డును వివరణ ఇవ్వాలని కోరింది. దీంతో సెన్సార్ కమిషన్ ఆదిపురుష్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అది సినిమా అయినా.. ట్రైలర్ అయినా.. సెన్సార్ బోర్డు ముందుకు రాకుండా విడుదల చేయటం నిబంధనలకు విరుద్ధమని సెన్సార్ బోర్డు పేర్కొంది. ఇతర భాషల్లో సెన్సార్ బోర్డు అనుమతి తీసుకున్నంత మాత్రాన ఉత్తర్ ప్రదేశ్ సెన్సార్ బోర్డు ముందు ప్రదర్శించకుండానే ట్రైలర్ ఎలా విడుదల చేస్తారంటూ సెన్సార్ సభ్యులు మండిపడ్డారు.
ఆదిపురుష్ రామాయణం ఆధారంగా తెరకెక్కిన మైథలాజికల్ సినిమా. ఈ సంక్రాంతికి ఆదిపురుష్ విడుదల కావాల్సి ఉండగా.. సినిమా చుట్టూ ఉన్న వివాదాలతో రిలీజ్ వాయిదా పడింది. సినిమాలో రామాయణంలోని క్యారెక్టర్లను తన ఇష్టమొచ్చినట్టుగా మార్చేశాడంటూ డైరెక్టర్ ఓం రౌత్ పై విమర్శలు వచ్చాయి. అలాగే.. ఇదేదో యానిమేషన్ సినిమాలా ఉందే తప్ప మనుషులను పెట్టి తీసిన సినిమాలాగా లేదంటూ క్రిటిక్స్ కామెంట్స్ చేశారు. దీంతో సినిమా విడుదల వాయిదా పడింది. పాన్ ఇండియా సినిమా అని చెప్తున్న ఆదిపురుష్ ఎప్పటికి థియేటర్లలోకి వస్తుందో తెలియదు.