పుల్వామా దాడికి సూత్రధారుల్లో ఒకడైన పాకిస్తాన్ టెర్రరిస్టు కమాండర్ హమ్జా బుర్హాన్‌ను పాకిస్తాన్‌లోనే గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. భారత్ సహా కొన్ని దేశాలు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా ప్రకటించిన హమ్జాను దేశంలో స్వేచ్ఛగా తిరగనిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం.. హమ్జా సహా ఎంతో మంది భారత వ్యతిరేక తీవ్రవాద గుంపులను పెంచి పోషిస్తుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ చేతుల్లో కుక్క చావు చచ్చిన అనేక మంది తీవ్రవాదులకు పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించటం.. ఆ కార్యక్రమానికి పాకిస్తాన్ ఆర్మీలోని ఉన్నత స్థాయి అధికారులు హాజరు కావటం గతంలో చూశాం. ఇప్పుడు కూడా పాకిస్తాన్‌లో అలాంటి సంఘటనే మరోసారి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హతమైన హమ్జా అంత్యక్రియలకు పాకిస్తాన్‌లోని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు నాయకులు.. పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిథులు.. ఆర్మీకి చెందిన వాళ్ళు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా భారత్‌లో ఎన్నో విధ్వంసాలకు కారణమైన హిజ్‌బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్, అల్–బదర్ ఉగ్రవాద సంస్థ అధినేత భక్త్ జమీన్ ఖాన్ వంటి కరడుగట్టిన ఉగ్రవాద నాయకులు ఒకేచోట చేరి ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు ఉన్నాయనే సాకుతో వీరికి భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ అంత్యక్రియలు నిర్వహించడం విశేషం.
పుల్వామాలో ఇండియన్ ఆర్మీపై దాడి చేసి ఏకంగా 40 మంది భారత వీర జవాన్ల ప్రాణాలు తీసిన వారిలో అంత్యత ముఖ్యుడైన హమ్జాకు.. పాకిస్తాన్ ప్రభుత్వం బహిరంగంగానే ఆశ్రయం కల్పిస్తోంది. హమ్జా అంత్యక్రియలకు హాజరైన తీవ్రవాదులంతా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులే. ఏ మాత్రం భయం లేకుండా భారీ రక్షణ ఏర్పాట్ల మధ్య టెర్రరిస్టులంతా కలిసి హమ్జా అంత్యక్రియలు నిర్వహించటం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. మా దేశంలో టెర్రరిస్టులు లేరు అనీ.. మా దేశంలో టెర్రరిజానికి తావు లేదు అనీ అంతర్జాతీయ సమాజం ముందు అరిచి మరీ చెప్పే పాకిస్తాన్ పాలకులు.. లేదు లేదు అంటూనే బహిరంగంగా టెర్రరిస్టులకు ఆశ్రయమిస్తున్నారు. ఇంత బహిరంగంగా టెర్రరిస్టులు తమ కార్యకలాపాలు స్వేచ్ఛగా నిర్వహించుకోవటం ఒక రకంగా భారత్‌కు పెద్ద హెచ్చరిక అని చెప్పాలి.
భారత్‌లో ముంబై దాడులు, పుల్వామా దాడి, పహల్గామ్ దాడులకు ప్రణాళిక రచించిన మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదులు పాకిస్తాన్‌లో ఐఎస్ఐ రక్షణలో ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి ఈ టెర్రరిస్టులను గుర్తు తెలియని వ్యక్తులు టార్గెట్ చేసుకొని.. బయట కనిపించగానే కాల్చి చంపేసి వెళ్ళిపోతున్నారు. తమ దేశంలో టెర్రరిస్టులు లేరు అని బల్ల గుద్ది మరీ చెప్పే పాకిస్తాన్ పాలకులు.. గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో టెర్రరిస్టులు హతమైన ప్రతి సారీ.. ఈ దాడులకు కారణం భారత్ అని నిందిస్తుంటుంది. భారత్ కు చెందిన నిఘా సంస్థలు ఆప్ఘనిస్తాన్‌కు చెందిన షార్ప్ షూటర్లను కిరాయి హంతకులుగా నియమించుకొని తమ దేశంలో దాడులు చేయిస్తోందంటూ పాకిస్తాన్ ఇప్పటికే చాలా సార్లు అంతర్జాతీయ వేదికలపై ఆరోపించింది. తాజాగా హమ్జా విషయంలో పాకిస్తాన్ ఏరకంగా స్పందిస్తుందో చూడాలి.



