తమిళనాడుకు ముఖ్యమంత్రి అయినా సరే.. దళపతి విజయ్‌కు సినిమా కష్టాలు మాత్రం తప్పటం లేదు. అప్పుడెప్పుడో విడుదల అవుతుందనుకున్న విజయ్ లాస్ట్ సినిమా జననాయగన్.. ఇప్పటికీ సెన్సార్ ఆఫీస్ గడప దాటడం లేదు. ఎన్నికలకు ముందే జననాయగన్ సినిమా రిలీజ్ చేస్తే ఎన్నికల్లో ఓట్లు సంపాదించేందుకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని హడావుడిగా రిలీజ్ ప్లాన్ చేశారు విజయ్ టీమ్.. ఎన్నికలు అయిపోయి.. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా పాపం తన సినిమా ఇంకా రిలీజ్‌కు నోచుకోవటం లేదు. సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయనీ.. మతాల మధ్య మనుషుల మధ్య భేదాభిప్రాయాలు తీసుకొచ్చే సీన్స్ సినిమాలో ఉన్నాయనీ.. వాటిని తొలగించాలని చెప్పిన సెన్సార్ కమిషన్.. ఎడిటింగ్ చేసి పంపించిన కాపీని ఇంకా అప్రూవ్ చేయనేలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కావాలనే సెన్సార్ పేరుతో విజయ్ ను ఇబ్బంది పెడుతోందనీ.. ఈ సినిమా విడుదల కాకుండా విజయ్ను ఇబ్బంది పెట్టి తమ పార్టీ వైపు తిప్పుకోవాలని బీజేపీ ప్లాన్ చేసిందనీ చాలా మంది అన్నారు. కానీ.. ఇప్పుడు తమిళనాడులో స్వయంగా విజయ్ సీఎంగా ఉన్నా.. సినిమాకు మాత్రం తిప్పలు తప్పటం లేదు.
సాధారణంగా విజయ్ లాంటి స్టార్ల సినిమాలు సెన్సార్ కావటానికి కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. కానీ నెలల తరబడి టైమ్ తీసుకోవటం జరగదు. బ్యాంకు లోన్లు తీసుకొని.. అప్పులు చేసి మరీ పెద్ద సినిమాలు తెరకెక్కిస్తారు. అలాంటి సినిమా ఎంత ఆలస్యం అయితే.. అన్ని రోజుల పాటు తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టాల్సి ఉంటుంది. ఒక్క సారి సినిమా రిలీజ్ అయి కలెక్షన్లు వస్తే.. ఇక అప్పుల బాధ నుంచి తప్పించుకోవచ్చని నిర్మాతలు భావిస్తారు. కానీ జననాయగన్ సినిమా విషయంలో సీన్ రివర్స్ అయింది. విడుదలకు సిద్ధమై నెలలు గడుస్తున్నా ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది పరిస్థితి. దీంతో సినిమాను కొన్న బయ్యర్లు.. డిస్ట్రిబ్యూటర్లు అందరూ నష్టాల కష్టాలు అనుభవించక తప్పడం లేదు. తన జీవితంలో ఒక మైలు రాయిగా నిలిచిపోతుందని జననాయగన్ పై కోటి ఆశలు పెట్టుకున్నాడు విజయ్. కానీ.. ఇప్పటికీ ఆ సినిమా మాత్రం ప్రేక్షకుల ముందుకు రాలేదు. తమ అభిమాన హీరో చివరి సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న విజయ్ అభిమానుల కలలు నెరవేరే సమయం ఎప్పుడొస్తుందో మరి.
