ఆఫ్రికా డేంజరస్ వైరస్ ఎబోలా లోని కొత్త వేరియంట్ బుండిబ్యుగో ఎబోలా.. శరవేగంగా వ్యాప్తిస్తూ ప్రపంచాన్ని వణికిస్తోంది. కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ దేశాలతో పాటు వాటి సరిహద్దు దేశాల్లో ఈ రకమైన ఎబోలా కేసులు వేగంగా పెరగటంతో పాటు.. సరిహద్దులు దాటి మరింత వేగంగా విస్తరిస్తోంది. దీంతో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఎబోలా ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ ఆఫ్రికన్ దేశాలకు రాకపోకలు దాదాపుగా నిలిపివేసింది. ప్రపంచ దేశాలకు అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. కొన్ని సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో కనుగొన్న ఎబోలా వైరస్ కంటే.. ఇప్పుడు వ్యాపిస్తున్న కొత్త వేరియంట్ బుండిబ్యుగో ఎబోలా.. మరింత ప్రమాదకరంగా పరిణమించిందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆఫ్రికా దేశాల్లో కొత్తగా వాంతులు విరోచనాలు వంటి లక్షణాలు కనిపిస్తున్న బాధితుల సంఖ్య పెరగటంతో ఆయా దేశాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. లక్షణాలు కనిపించిన వారిని వెంటనే క్వారంటైన్‌కు తరలిస్తున్నాయి. దీనిపై అప్రమత్తమైన భారత ప్రభుత్వం.. అత్యవసరం అయితే తప్ప కాంగో, ఉగాండా, సౌత సూడాన్ దేశాలకు వెళ్ళవద్దని హెచ్చరించింది. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల నుంచి వస్తున్న వారిని విమానాశ్రయాల్లోనే క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహించాకే అనుమతించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ వైరస్ సోకితే వ్యాధిగ్రస్తుల్లో వాంతులు, విరోచనాలతో పాటు తీవ్రమైన కండరాల నొప్పి, తలనొప్పి కనిపిస్తాయి. వైరస్ సోకిన కొద్ది రోజుల తర్వాత శరీరంలో ఇంటర్నల్ బ్లీడింగ్.. అంటే అంతర్గత రక్తస్రావం జరగటంతో పాటు శరీరంలోని ఒక్కో అవయవం పనిచేయకుండా పోయి చివరకు మనిషి మరణిస్తాడని వైద్యులు చెప్తున్నారు. ఈ రకమైన వైసర్ సోకితే మరణాల రేటు 40 శాతాన్ని మించి కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మొదటి వేరియంట్ వల్ల సంభవించిన మరణాల కంటే ఇది కాస్త ఎక్కువేనని చెప్తున్నారు. ఇక్కడ మరో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. పాత వేరియంట్ అయిన జైర్ స్ట్రెయిన్ ఎబోలా వైరస్ కోసం తయారు చేసిన మందులే కాదు వ్యాక్సిన్లు కూడా ఈ వేరియంట్‌పై పని చేయటం లేదు. ఇప్పటికిప్పుడు ఈ వేరియంట్‌కు మందులు వ్యాక్సిన్లు తయారు చేయటం సాధ్యమయ్యే పని కాదు కాబట్టి.. దీనిపై మరింత అప్రమత్తంగా లేకపోతే భారీ ప్రాణనష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు భారత్‌లో ఇలాంటి కేసులు నమోదు కాకపోయినా.. వైరస్ వ్యాప్తి చెందే వేగాన్ని చూస్తే.. ఇది ప్రపంచ వ్యాప్తంగా కనిపించటానికి ఎంతో సమయం పట్టేలా లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత వేగంగా ఈ వైరస్‌కు మందులు మరియు వ్యాక్యిన్ తయారు చేసే పనిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తలమునకలై ఉంది
