ఊహించినట్టే ఫల్టా నియోజకవర్గంలో జరిగిన రీపోలింగ్‌లో బీజేపీ చారిత్రక విజయం సాధించింది. మొత్తం 2.36 లక్షల ఓట్లకు గానూ.. బీజేపీ అభ్యర్థి దెబాంగ్‌షూ పాండాకు సుమారు 1.49లక్షల ఓట్లు పడ్డాయి. మొత్తంగా లక్ష 10 వేల ఓట్ల భారీ మెజార్టీతో బీజేపీ విజయం సాధించింది. ఇక్కడ ఎవరూ ఊహించని మరో విషయం ఏమిటంటే.. బీజేపీ తర్వాత అత్యధిక ఓట్లు.. సీపీఎం అభ్యర్థి శంభూనాథ్ కుర్మీకి పోలయ్యాయి. సుమారు 40 వేల ఓట్లు సాధించిన సీపీఎం అభ్యర్థి.. రెండో స్థానంలో నిలవగా.. 2011 నుంచి ఫల్టాలో జెండా పాతిన మమతా బెనర్జీ పార్టీ టీఎంసీకి కేవలం 7 వేల ఓట్లు రావటం గమనార్హం. అయితే.. పోలింగ్‌కు ముందే టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. మొత్తానికి తృణమూల్ కాంగ్రెస్ కంచుకోటలో అందరూ అనుకున్నట్టే బీజేపీ జెండా ఎగిరింది.
ఫల్టాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీఎంసీ పార్టీ అభ్యర్థి జహంగీర్ ఖాన్.. ఇతర పార్టీ నేతలను ప్రచారం చేసుకోకుండా అడ్డుకునే వాడనీ.. పోలింగ్ బూత్‌లలో తన మనుషులను పెట్టి రిగ్గింగ్ చేయించేవాడనీ స్థానికులు నేరుగా మీడియా ముందే చెప్పారు. అతడి మనుషులు నియోజకవర్గంలోని ఇంటింటికీ తిరిగి.. ఓటు వేస్తే మీ ఇంట్లో వాళ్ళను చంపేస్తామంటూ ఓటర్లను బెదిరించేవాడని వాపోయారు. ఇన్నాళ్ళూ జహంగీర్ ఖాన్ అతడి మనుషులకు భయపడి ఓట్లు వేయలేదని.. ఇప్పుడు ధైర్యంగా తమకు నచ్చిన పార్టీ ఓటు వేసి బీజేపీని గెలిపించుకుంటామనీ పోలింగ్‌కు ముందే ఓటర్లు చెప్పటం విశేషం. నిజానికి.. ఇక్కడ పశ్చిమ బెంగాల్ మొత్తంతో పాటే సాధారణ ఎన్నికలు జరిగినా.. మమతా బెనర్జీ మనుషులు పోలింగ్‌లో రిగ్గింగ్‌కు పాల్పడ్డారనీ.. బెదిరింపులకు దిగి ఓట్లు వేయకుండా చేశారనీ ఫిర్యాదు చేయటంతో.. ఇక్కడ రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇలా ఒక నియోజకవర్గం మొత్తం రీపోలింగ్‌కు ఆదేశించడం ఈసీ చరిత్రలో అత్యంత అరుదైన విషయం. పేరుకే ఎన్నికలు గానీ.. ఇక్కడ బీజేపీ విజయం ఖాయమని టీఎంసీకి కూడా ముందే అర్థం కావటం వల్లనే ఆ పార్టీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ పోటీ నుంచి తప్పుకున్నాడు. ఇప్పటికే బెంగాల్‌లో బీజేపీ ఘన విజయం సాధించి అక్కడ సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన విషయం తెలిసిందే.
