Home INTERNATIONAL NEWS ఇక ప్రతి వారం పెట్రోల్ రేట్ల పెంపు ?

ఇక ప్రతి వారం పెట్రోల్ రేట్ల పెంపు ?

0
1

మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. హర్మూజ్ జలసంధిపై అమెరికా ఇరాన్ పట్టువీడకపోవటంతో అక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ ఆండ్ గ్యాస్ సప్లైలో తీవ్ర అవాంతరాలు ఎదురౌతున్నాయి. అయితే.. ఇన్నాళ్ళూ రిజర్వ్ నిల్వలు ఉండటంతో భారత్‌పై ఈ ఇంధన ధరల ప్రభావం పెద్దగా పడలేదు. కానీ.. క్రమంగా ఇంధన నిల్వలు తరిగిపోతుండటం.. యుద్ధ వాతావరణం ఇంకా ముగియకపోవటంతో భారత ప్రభుత్వం తాజాగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచింది. ఒకే వారంలో వరుసగా రెండు సార్లు ధరలు పెంచిన భారత ప్రభుత్వం.. భ‌విష్యత్తులో కూడా ఈ పద్ధతిని కొనసాగించే అవకాశాలు భారీగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. రష్యా నుంచి భారత్ క్రూడ్ ఆయిల్ దిగుమతిపై అమెరికా విధించిన ఆంక్షలు సడలించినప్పటికీ.. భారత ఆయిల్ కంపెనీలపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్టు తెలుస్తోంది. ఇప్పటికీ ఒక్కో చమురు కంపెనీపై రోజుకు కనీసం వెయ్యి కోట్ల రూపాయల డిస్కౌంట్ భారం పడుతున్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు. ఇంధన ధరలు పెంచకపోతే ఈ భారం మరింత పెరిగి చివరికి ఆయా కంపెనీలు దివాలా తీసే స్థితికి వచ్చినా ఆశ్చర్యం లేదని భావించిన ఇండియన్ గవర్నమెంట్.. ఆ భారాన్ని కొంత వరకు వినియోగదారులు మోసేలా చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ లభ్యత మరియు ధరల హెచ్చుతగ్గులకు అనుగుణంగా భారత్‌లో తరచుగా ఇంధన ధరలను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఎవరు ఎన్ని ఆంక్షలు విధించినా దేశ ప్రయోజనాల కోసం భారత్ తనకు ఇష్టమొచ్చిన దేశం నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుందని.. భారత ప్రజల ఇంధన అవసరాలకు అనుగుణంగా దిగుమతులు ఉంటాయని ఇప్పటికే భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇరాన్ పై యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ట్రంప్ ఇప్పటికే ప్రకటించినప్పటికీ.. మిడిల్ ఈస్ట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉన్నందున.. ఇంధన ధరలపై నిలకడ ఉండే అవకాశం లేదు. ఇప్పటికే తలకు మించిన భారాన్ని మోసిన భారత ఆయిల్ కంపెనీలపై ఇక భవిష్యత్తులో భారాన్ని తగ్గించాలంటే అటు రష్యా వంటి దేశాల నుంచి దిగుమతులు పెంచటంతో పాటు.. ఇటు దేశీయ ఇంధన ధరలను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రధాని మోదీ కొద్ది రోజుల క్రితమే యూఏఈతో కీలకమైన ఇంధన ఒప్పందాలను కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా ఆయిల్ కంపెనీల భద్రత కోసం వారానికోసారి ఆయిల్ రేట్లను సవరించటం మాత్రమే సరైన నిర్ణయం అని నిపుణులు చెప్తున్నారు. వీరు చెప్పేదే నిజమైతే.. ఆయిల్ రేట్లు మరింత పెరగటం ఖాయం. అమెరికా ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరటం.. హర్ముజ్ జలసంధి దిగ్బంధం నుంచి బయటపడటం.. గల్ఫ్ దేశాల్లో ఆయిల్ ప్రొడక్షన్ పెరగటం.. ఇవన్నీ జరిగితే తప్ప ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల స్థిరీకరణ జరిగే అవకాశం లేదు.

No comments

Leave a reply

Please enter your comment!
Please enter your name here