కచ్చా బాదమ్ అంటూ దేశవ్యాప్తంగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన పశ్చిమ బెంగాల్ కు చెందిన భుబన్ బద్యాకర్.. ప్రస్తుతం అష్టకష్టాలు అనుభవిస్తున్నాడు. కనీసం ఇంటి అద్దె కట్టలేని పరిస్థితుల్లో సొంత ఊరు వదిలి మరో గ్రామానికి వెళ్ళిపోయాడు. భూబన్ సొంతూరు భీర్ భూమ్ లోని కురల్ జురి. అయితే.. సొంత గ్రామంలో యువకుల వేధింపులు భరించలేక.. ఇటు ఇంటి కిరాయి కూడా కట్టలేక.. చివరకు కుటుంబంతో సహా గ్రామాన్ని వదిలి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో గ్రామానికి వలస వెళ్ళాడు. ప్రతి నెలా 2800 ఇంటి కిరాయి కట్టడానికి కూడా భూబన్ కష్టపడాల్సి వస్తోందట.
శెనగలు, పల్లీలు అమ్ముకుని జీవనం గడిపే భుభన్.. కచ్చా బాదామ్ పాటతో రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోయాడు. దేశవ్యాప్తంగా కచ్చా బాదమ్ పాటతో పాటు భుబన్ వైరల్ అయిపోయారు. ఆ తర్వాత ఓ మోడల్ తో కలిసి కచ్చా బాదామ్ వీడియో సాంగ్ చేయటం.. అది కూడా యూట్యూబ్ లో బ్లాక్ బస్టర్ కావటంతో భుబన్ దశ తిరిగిపోయింది. కానీ ఆ మంచి కాలం ఎక్కువ రోజులు నిలవలేదు. ప్రస్తుతం మళ్ళీ శెనగలు, పల్లీలు అమ్ముకున్నా కూడా కుటుంబాన్ని పోషించలేని పరిస్థితి వచ్చింది పాపం. సెలబ్రిటీగా మారిన తర్వాత తాను సంపాదించిన డబ్బును ఊర్లోని యువకులు రకరాలుగా లాగేసుకున్నారనీ.. ఇప్పుడు కనీసం ఊర్లో ఉండనివ్వటం లేదనీ వాపోతున్నాడు భుబన్. తనను ఫేమస్ చేసిన కచ్చా బాదామ్ పాటకు కూడా కాపీరైట్ రావటంతో కనీసం ఆ పాట కూడా పాడుకోలేని పరిస్థితికి వచ్చేశాడు. భుబన్ ను ఎవరు ఆదుకుంటారో పాపం.