కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చే సంకల్పంతో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పంజాబ్ లోని హోషియాపూర్ లో జోడో యాత్ర నిర్వహిస్తున్నాడు. ఈ యాత్రలో భద్రతా వైఫల్యం బయటపడింది. రాహుల్ ను కౌగిలించుకోటానికి ఓ యువకుడు గుంపు లో నుంచి రాహుల్ వైపు దూసుకువచ్చాడు. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది ఆ యువకుడిని పక్కకు తీసుకెళ్ళారు. రాహుల్ తో పాటు ఉన్న పంజాబ్ కాంగ్రెస్ నేతలు ఆ యువకుడిని ఆపేసి పక్కకు పంపించి వేశారు. రాహుల్ ఢిల్లీలో భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న సమయంలో సెక్యూరిటీ సరిగ్గా లేదంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు కాంగ్రెస్ నేతలు లేఖ రాశారు.
పంజాబ్ లో ఈ ఘటన జరగటం పట్ల అక్కడి ప్రభుత్వం స్పందించింది. రాహుల్ యాత్రకు ప్రభుత్వం పూర్తి సెక్యూరిటీ అందజేస్తున్నదని చెప్పింది. అనుకోకుండా జరిగిన ఘటన వెనుక ఏదైనా కుట్ర ఉన్నదా అనేది గుర్తించేందుకు విచారణకు ఆదేశిస్తున్నట్టు చెప్పింది. ఇటీవల ప్రధానమంత్రి మోడీ రోడ్ షో లో కూడా ఇదే విధంగా ఓ వ్యక్తి మోడీ వైపు చేతిలో పూలదండతో దూసుకొచ్చాడు. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది.. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.