రష్యన్ ఎయిర్ ఫోర్స్ మరోసారి ఉక్రెయిన్ పై విరుచుకుపడింది. జనవరి 6,7 తేదీల్లో కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. అది పూర్తైన వెంటనే ఉక్రెయిన్ పై మళ్ళీ దండయాత్ర కొనసాగించాలని ఆదేశించటం గమనార్హం. సాధారణంగా డిసెంబర్ 25 క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు.. కానీ రష్యా ఉక్రెయిన్ దేశాల్లో జనవరి 6,7 తేదీల్లో ఆర్థోడాక్స్ క్రిస్మస్ పేరిట సంబరాలు జరుపుకుంటారు. జనవరి 7ను ఆర్థోడాక్స్ చర్చి జీసస్ పుట్టినరోజుగా వారు భావిస్తారు.. అంతకు ముందు రోజును క్రిస్మస్ ఈవ్ గా జరుపుకుంటారు. ఈ రెండు రోజుల్లో యుద్ధానికి బ్రేకిచ్చిన రష్యా.. ఆ తర్వాత ఉక్రెయిన్ పై ఊహించని దాడికి పాల్పడింది. ఉక్రెయిన్ గగనతలంలో దాడికి సిద్ధమవుతున్న 5 ఫైటర్ జెట్ యుద్ధ విమానాలను రష్యన్ ఎయిర్ ఫోర్స్ కూల్చివేసింది. వీటిలో ఒక ఎస్ యూ-24, ఎస్ యూ-25, ఎస్ యూ-27, మిగ్29 విమానాలున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కొనాషెంకోవ్ వెల్లడించారు.
ఒకేసారి 5 యుద్ధ విమానాలను కోల్పోవటం ఉక్రెయిన్ కు భారీ నష్టంగా భావించవచ్చు. అందులోనూ మిగ్29 ఫైటర్ జెట్.. రష్యాపై యుద్ధంలో కీలకంగా మారింది. అమెరికా, ఫ్రాన్స్, యురోపియన్ యూనియన్ అందజేసిన ఆయుధసాయంతో ఉక్రెయిన్ రష్యాతో భీకర యుద్ధం చేస్తోంది. అయితే.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే త్వరలోనే యుద్ధం చివరి అంకానికి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. యుద్ధం వల్ల రష్యాకు కూడా భారీ నష్టమే సంభవించింది. అయితే.. తనంతట తానే యుద్ధాన్ని విరమించటం ఇష్టం లేని పుతిన్.. భారత్ మధ్యవర్తిత్వం కోసం ఎదురుచూస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.