తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం కొండగట్టులో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కొండగట్టు అంజన్నను దర్శించుకునేందుకు వెళ్ళిన కేసీఆర్ కు అక్కడి పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత కేసీఆర్ అంజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాన్ని సందర్శించిన అనంతరం అక్కడి అధికారులతో భేటీ అయిన కేసీఆర్.. కొండగట్టును దేశంలోనే ప్రముఖ ఆంజనేయ స్వామి క్షేత్రంగా తీర్చిదిద్దాలని.. అందుకోసం మరో 500 కోట్లు కేటాయిస్తున్నామనీ చెప్పారు. ఇప్పటికే కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ఇటీవలే వంద కోట్ల నిధులు కేటాయించిన కేసీఆర్.. ఆ నిధులకు అదనంగా మరో 500 కోట్లు కేటాయించారు.
కొండగట్టు దేవాలయాన్ని వీలైనంత త్వరగా అభివృద్ధి చేయాలని.. తెలంగాణ రాష్ట్రానికి దేశంలో గుర్తింపు తెచ్చే స్థాయిలో అభివృద్ధి జరగాలని కేసీఆర్ ఆదేశించారు. ఆగమశాస్త్రం ప్రకారం నిర్మాణాలు జరిపించాలని ఇంజనీర్లకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే మొదలైన కొండగట్టు దేవాలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. హెలీకాప్టర్ ద్వారా ఆలయాన్ని విహంగ వీక్షణం చేశారు.