ఏపీలో తెలుగు దేశం పార్టీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా పనిచేస్తున్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్.. పలు కార్యక్రమాలకు కార్యాచరణ చేసి పెట్టుకున్నారు. చంద్రబాబు బహిరంగ సభలతో ప్రజల ముందుకు వెళ్తుంటే.. యువ నేత లోకేష్ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘమైన పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నాడు. జనవరి 27 నుంచి పాదయాత్ర చేయ తలపెట్టిన లోకేష్.. దీనికోసం ప్రభుత్వానికి లేఖలు రాయటం.. అనుమతి కోరటం.. అన్నీ జరిగాయి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం లోకేష్ పాదయాత్రకు అడ్డు చెప్తూ వచ్చింది. కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రాణనష్టం జరగటాన్ని సాకుగా చూపిస్తూ ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా పెండింగ్ పెట్టింది. అయితే ఎట్టకేలకు ఈ రోజు లోకేష్ పాదయాత్రకు అనుమతి లభించింది.
పాదయాత్ర ఏయే ప్రాంతాల్లో చేస్తున్నారు.. ఎవరెవరు యాత్రలో పాల్గొంటారు.. ఏ వాహనాలు వాడతారు.. ఇలా అనేక ప్రశ్నలకు లిఖిత పూర్వక సమాధానాలు ఇచ్చి.. పూర్తి వివరాలు అందజేసిన తర్వాత గానీ ఏపీ పోలీసులు లోకేష్ పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదు. తాజా వార్తతో తెలుగుదేశం పార్టీ నేతల్లో సంతోషం వ్యక్తమవుతోంది. గత కొద్ది రోజులుగా చంద్రబాబు సభలకు భారీ స్పందన వస్తోంది. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఇక నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభమైతే ప్రజా స్పందన ఎలా ఉంటుందో చూడాలి. బాబు ఆలోచన ఫలించి లోకేష్ పాదయాత్ర సక్సెస్ అయ్యిందంటే మాత్రం.. అది ఏపీ రాజకీయాల్లో పెద్ద మార్పులే తెస్తుందని చెప్పటంలో సందేహం లేదు.