వైభవ్ సూర్యవంశీ.. కేవలం 15 యేళ్ళ కుర్రాడు క్రికెట్లో ప్రపంచ రికార్డుల మోత మోగించేస్తున్నాడు. బౌలర్లను ఊచకోత కోసేస్తూ.. వచ్చిన ప్రతి బాల్‌ను స్టేడియం బయటకు పంపటమే టార్గెట్‌గా ఆడేస్తున్నాడు. ఈ కుర్రోడి బ్యాటింగ్ ధాటికి.. ఇతడికి బౌలింగ్ చేయాలంటేనే బౌలర్లు భయపడిపోతున్నారు. హేమాహేమీ బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ చేసి చుక్కలు చూపించిన సీనియర్ బౌలర్లు కూడా ఈ కుర్రోడికి బౌలింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్నారు. చిన్నా పెద్దా బౌలర్ తేడా లేకుండా సిక్సర్లు బాదేసి.. ఆ బౌలర్ల ఎకానమీని నాశనం చేసేస్తున్నాడు. దీంతో తమ స్టాటిస్టిక్స్ను నాశనం చేసుకోవటం ఇష్టంలేని బౌలర్లు.. వైభవ్‌కు బౌలింగ్ చేయటానికి తిరస్కరిస్తున్నారట. ఈ విషయం ఎవరో చెప్పలేదు.. ప్రపంచ సీనియర్ లఖ్‌నవూ జియంట్స్ కోచ్ జస్టిన్ లాంగర్ చెప్పిన మాటలివి. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో వైభవ్ బాదిన బాదుడు చూస్తే లాంగర్ మాటలు పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించవు.
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో వైభవ్ 38 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 93 పరుగులు చేసి విధ్వంసం సృష్టించి రాజస్థాన్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. లఖ్‌నవూపై భారీ ఇన్నింగ్స్‌తో యువ సంచలనం భారీ రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఎల్ఎస్జీతో మ్యాచ్‌కు ముందు ఈ సీజన్లో 486 పరుగులు చేసిన వైభవ్.. ఇప్పుడు 579 రన్స్‌తో టోర్నీలో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. ఈ క్రమంలో ఏ టీ20 టోర్నమెంట్‌లోనైనా 500 పరుగులు చేసిన అత్యంత చిన్న వయస్కుడైన ఆటగాడిగా వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. 20 ఏళ్లు నిండకముందే ఒక ఐపీఎల్ సీజన్లో 500 పరుగులు చేసిన మొట్టమొదటి ఆటగాడిగా కూడా వైభవ్ నిలిచాడు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఐపీఎల్ సీజన్లలో 500 పరుగుల కంటే ఎక్కువ రన్స్ చేసిన బ్యాటర్లలో వైభవ్‌దే అత్యధిక స్ట్రైక్‌రేట్. వైభవ్ స్ట్రైక్ రేట్ 236.. ఇది మరెవరికీ సాధ్యం కాని రికార్డు. ఈ సీజన్లో వైభవ్ ఇప్పటివరకు 53 సిక్సర్లు బాదాడు. దీంతో ఒక ఐపీఎల్ ఎడిషన్‌లో 50 సిక్స్‌లు బాదిన తొలి భారత బ్యాటర్‌గా ఘనత సాధించాడు. సూర్యవంశీ మరో ఏడు సిక్స్‌లు బాదితే క్రిస్ గేల్‌ను అధిగమించి ఒక ఐపీఎల్ సీజన్లో ఎక్కువ సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా రికార్డు తన ఖాతాలో వేసుకుంటాడు.
వైభవ్ షాట్లు చూసి అభిమానులే కాదు.. ప్రత్యర్థి టీమ్ అభిమానులు కూడా చప్పట్లు కొట్టకుండే ఉండలేకపోతున్నారు. ఇక కామెంటేటర్లు వైభవ్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు. 15 సంవత్సరాల వయసులో ఇంత పెద్ద క్రికెట్ ప్రపంచాన్ని అర్థం చేసుకోవటంతో పాటు.. దేనికి ఎలా రియాక్ట్ కావాలి.. ఎవరితో ఎలా ప్రవర్తించాలి.. మైదానంలో క్రమశిక్షణలో ఎలా ఉండాలి.. ఏ బౌలర్‌ను ఎలా ఎదుర్కోవాలి.. టీమ్ కోసం భారీ ఇన్నింగ్స్ జాగ్రత్తగా ఎలా నిర్మించాలి.. ఇవన్నీ ఎలా అర్థం చేసుకున్నాడోనని క్రికెట్ పండితులు ఆశ్చర్యపోతున్నారు. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్ మెన్ కంటే కూడా ఎక్కువ మెచూరిటీతో క్రికెట్ ఆడుతున్నాడంటూ ఆస్ట్రేలియా క్రికెట్ సీనియర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కానీ వైభవ్ సిక్సర్ల బాదుడుకు బలైన బౌలర్లు మాత్రం.. తమ రికార్డులను నాశనం చేసి.. కనీసం వచ్చే ఐపీఎల్ సీజన్లో తమను వేలం పాటకు పిలుస్తారో లేదో అన్న అనుమానం కలిగేలా చేస్తున్నాడని ఫీలవుతున్నారు పాపం. ఏది ఏమైనా.. ఇండియన్ క్రికెట్ భవిష్యత్ ఆశాకిరణం వైభవ్ సూర్యవంశీ అని చెప్పటంలో ఆశ్చర్యం లేదు.



