దేశంలోనే అతిపెద్ద నేషనలైజ్డ్ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. మే 25,26 తేదీల్లో స్ట్రైక్ చేయనున్నట్టు ఎస్బీఐ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. రెండు రోజుల స్ట్రైక్ ఫలితంగా నాలుగో శనివారం ఆదివారం బ్యాంకులకు సెలవు కాగా.. ఆ తర్వాత 25,26 తేదీల్లో ఉద్యోగుల సమ్మె.. ఆ తర్వాత మే 27న బక్రీద్ సెలవు కావటంతో వరుసగా ఎస్బీఐ 5 రోజులు పనిచేయదు. దీంతో ఎస్బీఐ యాజమాన్యం తమ కస్టమర్లకు ప్రత్యామ్నాయాలు సూచించింది. ఏటీఎంలను కస్టమర్ సర్వీస్ పాయింట్లను యోనో యూపీఐ వంటి ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలంటూ ఎస్బీఐ తన కస్టమర్లకు సూచించింది. బ్యాంకింగ్ వ్యవస్థలో ఐదో వంతు కార్యకలాపాలు ఎస్‌బీఐ ద్వారానే జరుగుతుంటాయి. ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో 52 కోట్ల మంది ఎస్‌బీఐ ఖాతాదారులపై ఈ ప్రభావం పడనుంది. ఖాతాదారులకు అత్యవసర సేవలకు గానూ 23,200 బ్యాంక్ శాఖల్లో అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్‌బీఐ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది.
అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయి ఉండి దేశంలోనే అత్యంత ఎక్కువ ఖాతాదారులను కలిగి ఉన్న ఎస్బీఐకి సరైన సంఖ్యలో సిబ్బంది లేరనీ.. ఉన్న సిబ్బందిపైనే అధికంగా భారం పడుతోందనీ ఎస్బీఐ ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాయి. తమపై అదనపు భారం తగ్గించాలంటే కొత్తగా ఉద్యోగులను నియమించాలనీ.. అలాగే సాయుధ గార్డులను నియమించటంతో పాటు ఎన్‌పీఎస్ ఉద్యోగులకు పెన్షన్ ఫండ్ మేనేజర్ ఎంపిక నియమాలను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఔట్ సోర్సింగ్ విధానాన్ని కూడా నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా బ్యాంకులు ఉద్యోగులను రిక్రూట్ చేసుకొని వారి చేత చేయించాల్సిన పనులను తక్కువ వేతనానికి పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల చేత చేయిస్తోంది ఎస్బీఐ. ఉద్యోగుల జీతం ఖర్చును తగ్గించుకునేందుకు ఎస్బీఐ ఇలా ఔట్ సోర్సింగ్ విధానాన్ని పాటిస్తూ కొత్త ఉద్యోగులను రిక్రూట్ చేసుకోకపోవటం వల్ల తమపై అధిక భారం పడటంతో పాటు నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించలేకపోతున్నారని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. అయితే.. ఈ సమ్మె చేస్తామని చెప్పినా ఎస్బీఐ యాజమాన్యం కస్టమర్లకు ప్రత్యామ్నాయాలను చూపిస్తోందే తప్ప ఉద్యోగుల డిమాండ్ల గురించి ఏరకమైన ప్రకటన చేయలేదు.
