వరుస తీవ్రవాద ఘటనలతో పాకిస్తాన్ అట్టుడికిపోతోంది. గత పది రోజుల నుంచి పాకిస్తాన్ లో పేరు మోసిన తీవ్రవాదులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేస్తుండటం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ను వార్తల్లో నిలిపింది. సోమవారం నాడు మరో సంచలన ఘటన పాకిస్తాన్లో జరిగింది. పోలీసులు ప్రయాణిస్తున్న ట్రక్ పై ఆత్మాహుతి దాడి జరిగింది. బలూచిస్తాన్ లోని క్వెట్టాకు 120 కిలోమీటర్ల దూరంలో గల ఖచ్చీ జిల్లాలోని దాదర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు ప్రయాణిస్తున్న ట్రక్ ను ఓ సూసైడ్ బాంబర్ బైక్ పై వెంబడిస్తూ వెనుక నుంచి ఢీకొట్టి తనను తాను పేల్చివేసుకున్నాడు. దీంతో ట్రక్ లో ప్రయాణిస్తున్న వారిలో 9 మంది పోలీసులు మృత్యువాతపడ్డారు. మరో 16 మంది పోలీసులు గాయపడ్డారు.
పేరుమోసిన తీవ్రవాదులను వరుసగా గుర్తు తెలియని వ్యక్తులు చంపేస్తుండటానికి ప్రతీకారంగా ఈ దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బలూచిస్తాన్ తిరుగుబాటు దారుల పని కూడా అయి ఉండవచ్చని భావిస్తున్నారు. గత 10 రోజులుగా పాకిస్తాన్ లో వరుసగా తీవ్రవాదులను టార్గెట్ కిల్లింగ్ చేస్తున్నారు గుర్తు తెలియని వ్యక్తులు. తీవ్రవాదులు ఉన్న ప్రదేశంలోకి బైక్ పై వేగంగా వెళ్ళి వారిని దగ్గరి నుంచి నుదుటిపై షూట్ చేసి చంపిన ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. దూరం నుంచి స్నైపర్ గన్స్ తో కాల్చిన ఘటనలు సైతం పాకిస్తాన్ లో నమోదయ్యాయి. దేశంలోనే పేరు మోసిన తీవ్రవాదులుగా పేరున్న వారినే లక్ష్యంగా చేసుకొని సినిమా తరహాలో ఈ హత్యలు జరుగుతున్నాయి. అయితే.. ఈ పని భారత్ కు చెందిన రీసెర్చ్ ఆండ్ అనాలిసిస్ వింగ్ పనిగా మొదట భావించారు. కానీ.. ఐఎంఎఫ్ షరతుల మేరకు పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ గూఢచార సంస్థ కావాలని తాను పెంచి పోషించిన తీవ్రవాదులను తానే హతమారుస్తున్నట్టు అమెరికా గూఢచార సంస్థ సీఐఏ బయటపెట్టింది.