తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ మెడికల్ పీజీ విద్యార్థిని ప్రీతి ఉదంతంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. బాధితురాలి కుటుంబానికి కవిత లేఖ రాశారు. “ఎంతో కష్టపడి పీజీ దాకా వచ్చిన ప్రీతి విషయంలో జరిగిన దారుణాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ప్రీతి తల్లిదండ్రుల బాధను నేను అర్థం చేసుకోగలను. ఇలాంటి బాధ మరే తల్లిదండ్రులకు రాకూడదు. ప్రీతి విషయంలో తప్పు చేసిన వారిని ప్రభుత్వం వదిలిపెట్టదు. మీ కుటుంబానికి కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చూస్తాం..” అంటూ కవిత ఆ లేఖలో పేర్కొన్నారు.
వారం రోజుల క్రితం వరంగల్ కాకతీయ మెడికల్ పీజీ విద్యార్థిని ప్రీతి పాయిజన్ ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది. స్ఫృహ కోల్పోయిన ప్రీతిని హాస్పిటల్ కు తరలించి వైద్యం అందించారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించి వైద్యం అందజేశారు. కానీ 5 రోజులు మృత్యువుతో పోరాడిన ప్రీతి చివరికి ఆదివారం రాత్రి 9 గంటలకు మరణించిందని వైద్యులు తెలిపారు. ప్రీతిని వేధించినట్టుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆమె సీనియర్ విద్యార్థి సైఫ్.. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నాడు.