పఠాన్ సినిమా కాంట్రవర్శీ రోజుకో మలుపు తిరుగుతోంది. బేషరమ్ పాట సృష్టించిన గాలివాన.. పెను తుఫాన్ గా మారింది. కాషాయ రంగును అవమానించిందంటూ దీపికను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన బీజేపీ నేతలు.. పఠాన్ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదం ఇప్పుడు మరో మెట్టు ఎక్కింది. జీహాదీలా ప్రవర్తిస్తున్న షారూఖ్ ఖాన్ ను చంపేయాలంటూ అయోధ్యకు చెందిన మహంత్ పరమహంస్ ఆచార్య అనే స్వామీజీ సంచలన ప్రకటన చేశాడు. హిందువుల మనో భావాలను దెబ్బతీసే పనులు చేస్తున్న షారూఖ్ ఖాన్ ను సజీవ దహనం చేయాలి అంటూ స్టేట్మెంట్ ఇచ్చేసి.. బేషరమ్ రచ్చను మరింత రాజేశాడు. దీంతో బాలీవుడ్ పత్రికలు షరా మామూలుగానే షారూఖ్ ఖాన్ ను ప్రాణభయం అంటూ హెడ్డింగులు పెట్టేసి వార్తలు రాసేస్తున్నాయి.
షారూష్ ఖాన్ దీపికా పదుకొణే కాంబినేషన్లో వస్తున్న పఠాన్ సినిమాలో బేషరమ్ పాట వచ్చీ రాగానే పెద్ద దుమారాన్ని రేపింది. ఈ పాటలో దీపికా పదుకొనే కాషాయ రంగు కాస్ట్యూమ్ ధరించటం.. ఆ బట్టలు కూడా చాలా బోల్డ్ గా ఉండటంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ప్రస్తుతం బాలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా బ్యాన్ పఠాన్ అంటూ కొత్త ట్రెండ్ చక్కర్లు కొడుతోంది. ఇంతకు ముందు మరో బడా ఖాన్.. అమీర్ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కున్నాడు. ఇండియన్ ఆర్మీని అవమానకరంగా చూపించాడంటూ లాల్ సింగ్ చడ్డాను దేశం మొత్తం బహిష్కరించింది. ఇప్పుడు షారూఖ్ వంతు వచ్చింది.