దిల్ దే దియా హై అంటూ అద్భుతంగా పాట పాడి దేశవ్యాప్తంగా వైరల్ గా మారిన ఇటుక బట్టి కూలీ అమర్జీత్ జైకర్ కు సినిమాలో పాడే బంపర్ ఆఫర్ ఇచ్చాడు సోనూ సూద్. తన కొత్త సినిమా ఫతే లో అమర్జీత్ తో ఓ పాట పాడించబోతున్నట్టు అనౌన్స్ చేశాడు. దీంతో అమర్జీత్ తెగ సంబరపడిపోతున్నాడు. బాలీవుడ్ పాటలు పాడుతూ ఆ వీడియోలను ట్విట్టర్ లో పోస్ట్ చేయటం అమర్జీత్ కు అలవాటు. రెండు రోజుల క్రితం కూడా అమర్జీత్.. దిల్ దే దియా హై అంటూ పాడిన వీడియో ట్విట్టర్ ట్వీట్ చేశాడు. గంటల్లోనే ఆ వీడియో వైరల్ గా మారింది. ట్విట్టర్ లోనే పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చేశాయి. అంతే కాకుండా బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్, నటి నీతూ చంద్ర ఈ ట్వీట్ ను రీ ట్వీట్ చేయటంతో మొత్తం బాలీవుడ్ దృష్టి ఈ వీడియోపైన పడింది.
దిల్ దే దియా హై అంటూ అద్భుతంగా పాడిన అమర్జీత్ పర్ఫార్మెన్స్ కు జనాలు ఫిదా అయిపోయారు. సెలబ్రిటీలు రీట్వీట్ చేయటంతో ట్విటర్ లో ఈ వీడియో ట్రెండ్ అయ్యింది. తన వీడియో ఈ రేంజ్ లో వైరల్ కావటం.. తనకు ఏకంగా బాలీవుడ్ సినిమాలో పాట పాడే అవకాశం రావటంతో అమర్జీత్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. తనకు అవకాశం ఇచ్చిన సోనూ సూద్ కు కృతజ్ఞతలు తెలిపిన అమర్జీత్.. త్వరలోనే ముంబై స్టూడియోలో పాట పాడబోతున్నానంటూ సంబరపడిపోతున్నాడు.